సినిమా అనే బలమైన మాధ్యమంతో రాజకీయం ఎలా చేయాలో కూడా నేర్పుతున్నాయి అటు కాంగ్రెస్,ఇటు బీజేపీ కూడా ! రాబోయే రోజుల్లో ఇంకొన్ని సినిమాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా అంటున్నాయి ప్రధాన పార్టీలు..కశ్మీర్ ఫైల్స్ సరే ! గోద్రా అల్లర్ల నేపథ్యంలో గుజరాత్ ఫైల్స్ అనే చిత్రాన్ని ఎప్పుడు తీస్తారని ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని విపక్షాలు నిలదీస్తున్నాయి.
రెండు ప్రధాన పార్టీలకు ఓ సినిమా ఉమ్మడి అజెండాగానే మారిపోయింది. బీజేపీ ఆ ఒక్క సినిమాతో ఓట్లు దండుకోవాలని అనుకుంటోంది అని కాంగ్రెస్ అంటుంటే, తాము నిజాలే చెప్పామని, ఆ సినిమాతో ఎందరో బాధితుల గొంతుకలు వినిపింపజేశామని కశ్మీర్ ఫైల్స్ దర్శకులు అంటున్నారు.ఆ విధంగా బీజేపీ కూడా ఆ దర్శకులకే వత్తాసు పలుకుతోంది.దీంతో ఎన్నికలు రాకముందే సినిమా చూపిస్తున్నారు. కాదు కాదు సినిమాతో ఓ పెద్ద రాజకీయ యుద్ధానికే తెరలేపారు.
“ఖర్చు 5 కోట్లు, రాబడి 100 కోట్ల పైనే..
అధనంగా బీజేపీ రాష్ట్రాలలో నో ట్యాక్స్
ప్రజల భావోద్వేగాల మీద వ్యాపారం భలే ఉంది కదూ! ” అని అంటోంది కాంగ్రెస్.
ఇప్పుడే దేశ వ్యాప్తంగా చర్చకు తావిస్తున్న కశ్మీరీ ఫైల్స్ సినిమాను బీజేపీ తనకు అనుగుణంగా మలుచుకుంటుంది అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. కానీ వాస్తవాలు మాత్రం దాచిపెడుతూ ప్రజలను మభ్యపెడుతోంది అని కూడా అంటోంది కాంగ్రెస్.ఆ రోజు ఏం జరిగిందో ఎవరు ఎవరిని రక్షించారో అన్నది కూడా తెలియకుండా బీజేపీ ఓ వింత నాటకం ఒకటి నడుపుతోందని అభియోగాలు చేస్తోంది కాంగ్రెస్. దీంతో పాటు ఈ సినిమాను తమకు ముఖ్యంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా మలుచుకునేందుకు వీలుగా వాడుకోవాలని చూడడమే ఇప్పటి దౌర్భాగ్యం అని కాంగ్రెస్ మండిపడుతోంది.
కానీ ఆరోజు ఏం జరిగిందో, వాటి వెనుక వాస్తవాలేంటో తాము వివరిస్తూ ఉన్నా కూడా చాలా మంది గుర్తించలేకపోతున్నారన్నది కాంగ్రెస్ పార్టీ ఆవేదన.కశ్మీరీ పండిట్లకు ఆ రోజు ఇంటి స్థలాలను పంపిణీ చేసిన ఘటన అప్పటి ప్రధాని మన్మోహన్ దేనని, అదేవిధంగా కొన్ని రాయితీలు, విద్యా సౌకర్యం, రుణాలపై వడ్డీ మాఫీ, యువతకు ఆరు వేల ఉద్యోగాలు, గృహ నిర్మాణానికి కుటుంబానికి ఏడున్నర లక్షల రూపాయల సాయం, నెలవారీ సహాయ నిధి పంపిణీ, 335 కోట్ల రూపాయలతో నాలుగు వేలకు పైగా ప్లాట్లతో వారి కోసం ప్రత్యేక రీతిలో టౌన్ షిప్ నిర్మాణం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో చేసినవే అని ఆ పార్టీ అంటోంది. కానీ మోడీ వారి కోసం ఏం చేయకుండానే ఓ సినిమా తో రాజకీయం అంతా తనకు అనుకూలంగా మలుచుకోవడం శోచనీయం అని వాపోతోంది. బాధిత పండిట్ కుటుంబాలను వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది.