భారత త్రివిధ దళాల చరిత్రలో మొదటి సారిగా ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇద్దరు మిత్రులు ఇండియన్ ఆర్మీ, నేవీకి చీఫ్లుగా నియమితులవ్వడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు క్లాస్ మేట్స్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ప్రస్తుతం భారత సైన్యం, నావికా దళాలకు చీఫ్‌లుగా ఎంపిక అయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో వీరిద్దరూ 1970లో 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచి మంచి మిత్రులు. భారత సైన్యంలో వివిధ దళాల్లో.. వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వారు ఎల్లప్పుడూ టచ్లో ఉండేవారు. ఈ ఇద్దరు సహచరుల నియామకాలు కూడా దాదాపు రెండు నెలల వ్యవధిలోనే జరగడం గమనార్హం. మరోవైపు, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద యుద్ధ అమరవీరులకు నివాళులర్పించి పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంంలో లెఫ్టినెంట్ జనరల్గా ఉపేంద్ర ద్వివేది త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.