ఈనెల 2వ తేదీన ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరగడానికి సిగ్నల్ వ్యవస్థలో ఎవరో చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు వరసగా పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. రిలే రూంలోకి ఎవరైనా వెళ్లగలిగితే సిగ్నలింగ్‌లో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఇలాంటి పరిస్థితుల్లోనే లూప్‌లైన్లోకి వెళ్లిందని తాజా ఉత్తర్వు పరోక్షంగా ప్రస్తావించింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వేబోర్డు.. రైళ్లు నడవడంలో కీలకంగా నిలిచే వ్యవస్థలపై ఇకపై రెండేసి తాళాలు వేసి భద్రంగా చూసుకోవాలని ఆదేశించింది. రైళ్ల నియంత్రణ వ్యవస్థలు ఉండే రిలేరూంలు, లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద సిగ్నలింగ్-టెలికమ్యూనికేషన్ల పరికరాలను ఉంచే ‘రిలే హట్’లు, పాయింట్/ ట్రాక్ సర్క్యూట్ సిగ్నళ్ల వద్ద ఈ మేరకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని శనివారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపింది.
రెండు తాళాల వ్యవస్థను ఏర్పాటు చేసే వరకు ప్రస్తుతం ఉన్న ఒకే తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్ద భద్రపరచాలని బోర్డు ఉత్తర్వులు ఆదేశిస్తున్నాయి. ఏ విభాగం తాళాలను ఎవరు తీశారు, ఎవరు వేశారు అనేవి పట్టికలో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది.