రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలపై ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. మండిపోతున్న ఎండలతో భూతాపంపై మళ్లీ చర్చ మొదలవుతోంది. ఉష్ణోగ్రత పెంపుదల 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ 2 డిగ్రీల దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిందేనంటూ ఐక్యరాజ్యసమితి తాజాగా హెచ్చరించింది. లేని యెడల అనర్థం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
1750 తర్వాత మొదలైన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచంలో బొగ్గు, చమురు ఇతర శిలాజ ఇంధనాలను మండించడం పెరిగింది. ఫలితంగా వాతావరణంలో మార్పులు మొదలై ఉష్ణోగ్రతలు పెరగటం ఆరంభమైంది. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే ఇప్పటికి భూతాపం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోకుండా, 1.5 దగ్గరే ఆపాలని ప్రపంచ దేశాలన్నీ కలసి కొన్నేళ్ల కిందట తీర్మానించాయి.
కానీ ఈసారి ఎండలను చూస్తుంటే మానవాళి సంకల్పం విఫలమయ్యేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2030లోపే ‘1.5 డిగ్రీల సెల్సియస్ గీత’ దాటి పోతామేమోననే భయం శాస్త్రవేత్తల్లో కనిపిస్తోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.