ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్ ప్రస్తుతం ఉన్న ఇంధనం, గ్యాస్ ధరలను భరించే స్థితిలో లేదని స్పష్టం చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. రష్యా రాజధాని మాస్కోలో పర్యటిస్తున్న జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి షెర్గీ లావ్‌రోవ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇదే సమయంలో.. పలు అంతర్జాతీయ అంశాలపైనా సమాలోచనలు జరిపారు.
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిళ్లను పరోక్షంగా తోసిపుచ్చారు. తమకు ప్రయోజనం ఉంటుందంటే.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తామని ఈ విషయంలో తగ్గేదేలే అని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని జైశంకర్ కోరారు. యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
” ఎక్కడ ఎలాంటి వివాదం నడిచినా.. దానితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. ఇప్పటికే ఇంధనం, ఆహారభద్రత విషయంలో అనేక విపరిణామాలు ఎదుర్కొంటున్నాం. అందుకే తక్షణమే దౌత్య పద్ధతిలో చర్చలు చేపట్టాలని భారత్ గట్టిగా సూచిస్తోంది. మేమెప్పుడూ శాంతి వైపే ఉంటాం. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస విధానాలను గౌరవిస్తాం.” – ఎస్.జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి