ఝార్ఖండ్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపాయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ఈ ఊహాగానాలు వైరల్ అవుతుంటే.. తాజాగా కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ చేసిన పోస్టు ఇప్పుడు వాటికి బలాన్ని చేకూరుస్తోంది. సోరెన్ను పులితో పోలుస్తూ .. ‘‘చంపాయీ సోరెన్.. మీరు పులి. మీరు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎన్డీయే ఫ్యామిలీలోకి స్వాగతం.’’ అని ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాంఝీ.. హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత. ఆ పార్టీ బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది.
ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ బీజేపీతో చేతులు కలుపుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం దిల్లీ చేరుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇక బీజేపీలో చేరికపై సోరెన్ ఇటీవల మాట్లాడుతూ.. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందని అన్నారు.