మౌసమ్ యాప్ తో వాతావరణ సమాచారం: కేంద్రమంత్రి హర్షవర్ధన్

-

వాతావరణ సమాచారం కోసం ఇన్నాళ్లూ గూగుల్​ లేదా మొబైల్​ తయారీదారులు అందించే యాప్​లపై ఆధారపడేవాళ్లం. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మొబైల్​ అప్లికేషన్​ను రూపొందించింది కేంద్ర వాతావరణ విభాగం. చిటికెలో సమగ్ర వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా.. మొబైల్​ యాప్​ను ఆవిష్కరించారు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్​. ‘మౌసమ్​’ పేరుతో విడుదలైన ఈ మొబైల్​ అప్లికేషన్​ ద్వారా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘మౌసమ్​’ యాప్​ను ఇంటర్నేషనల్​ క్రాప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ద సెమీ-ఏరిడ్​ ట్రాపిక్స్​(ఇక్రిసాట్​), ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ట్రాపికల్​ మెటియోరాలజీ(ఐఐటీఎం), పుణె, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సంయుక్తంగా రూపొందించి అభివృద్ధి చేశాయి.వాతావరణానికి సంబంధించి విభిన్న సేవల్ని అందించే ‘మౌసమ్​’ యాప్​.. ‘గూగుల్​ ప్లే స్టోర్​’, ‘యాపిల్​ యాప్​ స్టోర్’​లో అందుబాటులో ఉంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, ఆర్ధ్రత, గాలి వేగం వంటి సమగ్ర సమాచారాన్ని ఈ యాప్​ అందించనుంది. స్థానిక వాతావరణం వివరాలతో పాటు విపత్తుల సమయంలో ప్రత్యేక హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీచేస్తుందీ యాప్​. గడిచిన 24 గంటల వాతావరణ సమాచారంతో సహా.. రాబోయే వారం రోజుల వాతావరణ పరిస్థితులను తెలియజేస్తుంది. ప్రమాద హెచ్చరికలకు సంబంధించి భిన్న రంగుల్లో(ఎరుపు, పసుపు, నారింజ) కోడ్​ను రూపొందించడం ఇందులో ప్రత్యేకత.

Read more RELATED
Recommended to you

Exit mobile version