పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు ఆ రాష్ట్రంలో రణరంగం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ రోజున ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఓట్ల లెక్కింపు కూడా పలుచోట్ల ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. డైమండ్ హార్బర్‌లోని ఓ కౌంటింగ్ కేంద్రంపై దుండగులు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరికీ ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు.
హావ్‌డాలోని కౌంటింగ్ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఉదయం 8 గంటలకు 22 జిల్లాల పరిధిలోని 339 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావటానికి రెండు రోజులు పట్టే అవకాశముందని బంగాల్ ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సాయంత్రానికి ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.