కూరగాయల ధరలు గత కొద్ది నెలలకు ఆకాశాన్ని అంటాయి. సామాన్యులు విపరీతంగా విక్రయించే టమోటా, పచ్చిమిర్చి ధరలు అయితే అసలు కొనడానికే లేకుండా పోయాయి. కేజీ 10- 20 ఉండే టమాటలు 110- 150 వరకూ ఉన్నాయి. దీంతో కొందరు వాటిని కొనడమే మానేశారు. పచ్చిమిర్చి కూడా కేజీ 80-100 వరకూ ఉంటుంది. టమోటా ధరలు పెరిగినప్పుడు ఇవి మహా అయితే 20 రోజులు లేకపోతే నెల ఉంటాయిలే అనుకున్నారు. నిజానికి ఏటా ఒక దశలో టమాట ధరలు పెరుగుతాయి. నెల రోజుల తర్వాత తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం మూడు నెలలు అయినా ధరలో మార్పు లేదు. అసలు ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయి, నిపుణులు ఏం అంటున్నారు.?
అస్థిరమైన వర్షాల కారణంగా పంటలు వేయడం ఆలస్యమైంది. ఈ వర్షాల కారణంగా పండిన పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో పెరిగిన కూరగాయల ధరలు ఇంకొంతకాలం ఇలాగే కొనసాగవచ్చని రైతులు, వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో 6% వెయిటేజీ కూరగాయలదే. జూన్‌లో ఈ ఇండెక్స్ ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. నెలవారీగా చూస్తే ఈ సూచీ 12% పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా పంటలు మార్కెట్‌కు వచ్చే సమయానికి అంటే ఆగస్టు నెలకు ధరలు తగ్గాలి. కానీ ఏడు పరిస్థితి భిన్నంగా ఉంది.
సరఫరాల్లో అంతరాయం కారణంగా అక్టోబర్ వరకు ధరలు ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. ఈ వర్షాకాలం కూరగాయల సరఫరాకు తీవ్ర అంతరాయం కలగుతోందని, ఈ సంవత్సరం చాలాకాలం పాటు కూరగాయల ధరలు అధికంగానే ఉంటాయని ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు అంటున్నారు.
ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్లు, అల్లం, మిరపకాయలు, టమాటలు లాంటి కూరగాయల ధరలన్నీ అధికంగానే ఉండబోతున్నాయి. రాబోయే కొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లలలో అసంతృప్తి తప్పదు. అది కాస్తా ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అధిక ధరలు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది. ఇది జూలైలో ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుతుందని అంచనా. దీంతో ఈ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లను తగ్గించే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఆహార ధరల పెరుగుదలను తగ్గించడానికి సరఫరా వైపు చర్యలు తీసుకోవాలని, ఆర్‌బీఐ కనీసం డిసెంబర్ 2023 వరకు వడ్డీ రేట్లను మార్చదని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఇండియా ఎకనమిస్ట్ గౌరా సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు.
టమాట ధరలు హోల్‌సేల్ మార్కెట్‌లో 1,400 శాతం పెరిగాయి. గత మూడు నెలలుగా కిలోకు రూ.140 చొప్పున పలుకుతోంది. దీంతో సాధారణ ప్రజలు మాత్రమే కాదు హోటళ్లు, రెస్టారెంట్లు టమాట కొనడాన్ని తగ్గించారు.
కర్ణాటక మూడవ అతిపెద్ద టమోటా ఉత్పత్తి చేసే రాష్ట్రం. ఇక్కడి రైతులు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వైరస్ వ్యాప్తి కారణంగా పండించిన పంటను దెబ్బతీసిందని చెబుతున్నారు. గతవారం ధరలు తగ్గడంతో ఈసారి టమాట తక్కువగా పండించారు. దీంతో సాధారణం కన్నా 30 శాతం మాత్రమే దిగుబడి వచ్చినట్టు 200 ఎకరాలకు యజమాని అయిన ఓ రైతు తెలిపారు.