ఫ్రెషర్లకు విప్రో కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. వార్షిక ప్యాకేజీలో సగానికి తగ్గిస్తున్నట్లు మెయిల్ ద్వారా తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో, క్లయింట్ల నుంచి ఆర్డర్ల రాక ఆలస్యం అవుతున్నందున.. తాము తొలుత ఆఫర్ చేసిన వార్షిక వేతన ప్యాకేజీని సగానికి పరిమితం చేస్తామంటూ చెబుతోంది. 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని, 2023 మార్చి నుంచి రోల్స్‌లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించనుంది.
అయితే వేతన ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని, విధుల్లో చేరాల్సిందిగా వాళ్లకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ తెలిపింది. ‘‘ప్రస్తుత ఆఫర్‌కు మీరు అంగీకరిస్తే.. ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్ రద్దవుతుంద’ని ఫ్రెషర్లకు పంపిన మెయిల్‌లో విప్రో పేర్కొందని సమాచారం. శిక్షణ అనంతరం జరిపిన మదింపులో సరిగ్గా రాణించలేదంటూ 425 మంది ఫ్రెషర్లకు విప్రో ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. శిక్షణ విజయవంతం అయిన వారికి వేతన ప్యాకేజీని దాదాపు సగానికి తగ్గించుకోమని కోరడం గమనార్హం.