ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం తాజాగా ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈరోజు ఉదయం బెంగళూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న యడియూరప్పను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పోక్సో కేసులో ఆయన్ను అరెస్టు చేయవద్దని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయన్ను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణకు గైర్హాజరు కాకూడదని యడియూరప్పకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీఐడీ ఎదుట హాజరయ్యారు.
17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను యడ్డీ బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.