వచ్చే నెల 17 నుండి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని దుర్గ గుడి ఈవో సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఆన్లైన్ లో దర్శన టికెట్ లు అందుబాటులో ఉన్నాయన్న ఆయన కొండపైకి రవాణా సౌకర్యం లేదని, నది స్నానానికి కూడా అనుమతి లేదని అన్నారు. తలనీలాలు కూడా రద్దు చేసామని, భవాని భక్తులైన, సాధారణ భక్తులు అయిన ఆన్లైన్ లొనే టికెట్ తీసుకోవాలని అన్నారు, మొదటి రోజు ఉదయం 9 గంటలు నుండి రాత్రి 8 గంటలు వరకు మిగిలిన రోజులు ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందని ఆయన అన్నారు.
ఇక దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నామని ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందని అన్నారు. మూల నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తామని అన్నారు. 4వేల టికెట్ లు ఉచిత దర్శనానికి కేటాయించాము, 3 వేల టికెట్ లు 100 రూపాయలు, 3వేల టికెట్ లు 300 రూపాయలకు కేటాయించామని అన్నారు. టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలన్న ఆయన 5 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు దర్శనానికి అనుమతి లేదని అన్నారు. వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్ మీదుగా క్యూ లైన్ ద్వారా భక్తులు రావాలని ఆయన కోరారు.