గతకొన్ని రోజులుగా ప్రధాని మోదీ డిగ్రీ గురించి ఆప్ అనుమానాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. మంత్రుల డిగ్రీల గురించి ప్రశ్నించడం సరికాదని, ఆ మంత్రి ప్రజల కోసం ఏం చేశాడనేది చూడాలని సూచించారు.
‘2014లో ప్రజలు మోదీ డిగ్రీలు చూసి ఆయనకు ఓటేశారా..? అప్పటికే ఆయనకున్న ప్రజాకర్షణే గెలిపించింది. నాటి నుంచి తొమ్మిదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. ఈ సమయంలో ఆయన డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాల్లో ఆయన్ను మనం ప్రశ్నించాలి. డిగ్రీ అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆయన డిగ్రీపై స్పష్టత వస్తే.. ద్రవ్యోల్బణం తగ్గిపోతుందా..? ప్రజలకు ఉద్యోగాలు వస్తాయా..?’ అని అజిత్ పవార్ ఆప్ నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం పవార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.