ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అందులో ఎలాంటి డౌట్ లేదు..ఎన్నికలు ఏవైనా ఇక్కడ వైసీపీ హవానే. ఎందుకంటే ఈ జిల్లాలో రెడ్డి, ఎస్సీ వర్గం ఓట్లు ఎక్కువ. ఆ ఓట్లు వన్ సైడ్ గా వైసీపీకే పడిపోతున్నాయి. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి హవా నడిచిన నెల్లూరులో వైసీపీ హవా నడిచింది. 10 సీట్లకు 7 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు..10కి 10 సీట్లు గెలిచేసింది.
ఇలా వైసీపీ హవా ఉన్న నెల్లూరులో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. వైసీపీ సొంత తప్పిదాలే కొంప ముంచేలా ఉన్నాయి. ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం, ఎమ్మెల్యేలు అధికారం వాడుకుని ప్రతిపక్షాలని దెబ్బతీయడం, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో వైసీపీకి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీకి అండగా ఉన్న రెడ్డి వర్గంలోనే వ్యతిరేకత కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ముగ్గురు సీనియర్లు అందులో రెడ్డి ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్ ఇచ్చి బయటకొచ్చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీని వీడారు. అలాగే వారిని వైసీపీ సస్పెండ్ చేసి..ఇంకా ఫ్రీగా ఉండేలా చేసింది.
అయితే ఇంకా నెల్లూరులో రచ్చ నడుస్తోంది. కొందరు నేతల మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆయనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే.. వైసీపీ కీలక నేత మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో సుకుమార్ రెడ్డి కావలిలో అంతా తానై వ్యవహరించారు. కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేను ప్రశ్నించడం, ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడం.. ఆర్థిక లావాదేవీల్లో గొడవల కారణంగా ఇప్పుడు సస్పెన్షన్‌కు గురయ్యారని తెలుస్తోంది. మొత్తానికి నెల్లూరు లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.