ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారత్‌లోని యూజర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ను ఈ రోజు, రేపు (శని, ఆదివారాలు) ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఉన్న ఫీచర్లన్నింటినీ వాడుకోవచ్చు. యూజర్లు అందులో 48 గంటల పాటు ఏం కావాలన్నా ఉచితంగా చూడవచ్చు. అందుకు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. అలాగే ముందుగా పేమెంట్ వివరాలను యాడ్ చేయాల్సిన పని కూడా లేదు.
నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలంటే ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కు సబ్‌స్క్రైబ్ అయి ఉండరాదు. అంటే కొత్త మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌లను ఉపయోగించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అందుకు గాను యూజర్లు నెట్‌ఫ్లిక్స్ యాప్ లేదా Netflix.com/Streamfest అనే సైట్‌లోకి వెళ్లి అక్కడ పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో 48 గంటల ఉచిత స్ట్రీమింగ్ ఆఫర్ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. 2 రోజుల పాటు ఇలా నెట్‌ఫ్లిక్స్ ను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే యూజర్లు ఈ ఆఫర్ కింద కేవలం స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ) రిజల్యూషన్‌లో మాత్రమే వీడియోలను చూడగలరు. కావాలంటే రుసుం చెల్లించి హెచ్‌డీ ప్లాన్‌కు మారవచ్చు.
యూజర్లు ఈ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాక స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్, పీసీలలో దేంట్లోనైనా నెట్‌ఫ్లిక్స్ ను యాక్సెస్ చేసి టీవీ షోలు, మూవీలను వీక్షించవచ్చు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సీవోవో గ్రెగ్ పీటర్స్ మాట్లాడుతూ.. చాలా మందికి నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న సూపర్‌హిట్ టీవీ షోలు, సిరీస్, మూవీల గురించి తెలియదని, కనుక ఒక్కసారి వారు తమ యాప్‌లో ఉన్న కంటెంట్‌ను చూస్తే వారే అలవాటు పడతారని, అందుకనే ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని తెలిపారు.