మార్చిలోనే ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు జరుగుతుందని… ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల పై 7,500 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని.. వీటిలో విజయనగరం జిల్లాలో నాలుగు వేల 500, కృష్ణా జిల్లాలో 2,800, కడపలో 1300 వరకు వచ్చాయన్నారు. విజయనగరం జిల్లాలో ఒక్క మెంటాడ మండలం గురించే నాలుగు వేల వరకు అభ్యంతరాలు వచ్చాయని.. కృష్ణా జిల్లాలో రెవెన్యూ డివిజన్ గురించి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయని వివరించారు.
అంశాల వారీగా చూస్తే దాదాపు 60 వరకు అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయని.. వీటన్నింటినీ క్రోడీకరించి రేపు ముఖ్యమంత్రికు నివేదించనున్నామన్నారు. లోక్ సభ నియోజకవర్గం యూనిట్‌గా జిల్లాల ఏర్పాటు చేయాలనే సూత్రం వల్ల కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసే విధంగానే తుది మార్పులు ఉంటాయని వెల్లడించారు.
సహేతుకమైన సమస్యలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని.. ఈ నెల మూడో వారంలో తుది నోటిఫికేషన్ వస్తుందన్నారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజన శాశ్వత ప్రాతిపదికన చేయటానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు.