భారత్, శ్రీలంక మధ్య నేడు (శుక్రవారం) మూడో వన్డే జరగనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని గబ్బర్ సేన భావిస్తోంది. అయితే తొలి రెండు వన్డేలలో ఓటమి పాలైన శ్రీలంక చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
ఇది ఇలా ఉండగా భారత్ ఈ వన్డేలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. జట్టంతా యువ ఆటగాళ్ళు ఉండడం… వారంతా అవకాశం కోసం ఎదురు చూస్తుండడంతో వారిలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశం ఆసక్తిగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న సంజూ శాంసన్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.
ఇక స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో కొత్త ఆటగాళ్ళు రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తిల్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. గత మ్యాచ్ హీరో దీపక్ చాహర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తిమ్మిర్లతో బాధపడ్డాడు. అయితే టీ20 సిరీస్‌కు ముందు అతనికి విశ్రాంతి అవసరం అని జట్టు యాజమాన్యం భావిస్తే అతని స్థానంలో నవ్‌దీప్ సైనీకి లేదా చేతన్ సకారియాలకు అవకాశం లభించవచ్చు. ఇక ఓపెనింగ్ స్థానంలో మార్పు జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పృథ్వీ షాకు విశ్రాంతి ఇచ్చి దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లతో ప్రయోగం చేసే అవకాశం కూడా ఉంది.