తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజ్యసభ సీట్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల కాళీ అవుతున్న నాలుగు స్థానాలకు ఏపీలో ఎవరిని ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. షర్మిల, చిరంజీవి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ పేర్లు ప్రముఖంగా మీడియాలో వినపడుతున్నాయి.
ఇక తెలంగాణా విషయానికి వస్తే కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆమెతో పాటుగా మరికొందరి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు కెసిఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆర్ధికంగా బలంగా ఉన్నా లేకపోయినా సరే కెసిఆర్ రాజ్యసభకు పంపించడానికి సిద్దమయ్యారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మరో పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఆయన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2014 లో వైసీపీ నుంచి ఖమ్మం పార్లమెంట్ కి ఎంపికైన ఆయన ఆ తర్వాత తెరాస లో జాయిన్ అయ్యారు. కొన్ని వర్గ విభేదాలు ఉన్నా సరే ప్రజలతో మమేకం కావడంతో ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. అయితే నామా నాగేశ్వరరావు కోసం ఆయన్ను కెసిఆర్ కొన్నాళ్ళు పక్కన పెట్టారు. నామాకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వడంతో కొన్నాళ్ళు గా పొంగులేటి సైలెంట్ గా ఉన్నారు.
ఇప్పుడు పొంగులేటికి న్యాయం చెయ్యాలని భావిస్తున్నారు కెసిఆర్. తన వర్గంతో ఖమ్మం పార్లమెంట్ ని గెలుపుకి కృషి చేసిన ఆయన్ను రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరికొందరి పేర్లు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. దీనితో ఎవరికి కెసిఆర్ నుంచి పిలుపు వస్తుంది…? ఎవరు పార్లమెంట్ లో అడుగు పెడతారు అనేది తెలియాల్సి ఉంది.