బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి రాసలీలల కేసు కర్ణాటకలో సంచలన సృష్టించింది. ఈ కేసులో సీడీ కీలకంగా మారింది. దీంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నరేశ్‌గౌడ, శ్రవణ్ ప్రధాన ఆరోపితులుగా ఉన్నారు. సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజాగా నరేశ్ గౌడ్, శ్రవణ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే వీరికి బెయిల్ చేయొద్దని సిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి బెయిల్ మంజూరు సమంజసం కాదని పేర్కొన్నారు. సీడీ వివాదంలో వారే కీలకమని కోర్టుకు విన్నవించారు. సీడీ యువతి, మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళిని మొబైల్, వాట్సప్ వీడియోకాల్ ద్వారా సంప్రదించాలని వీరివురే సూచించినట్టు కీలక ఆధారాలను కోర్టుకు వివరించారు. బ్లాక్‌మెయిల్ ఆలోచనతోనే వీరు కుట్ర పన్నినట్టు సమాచారం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. సీడీ గ్యాంగ్ హనీట్రాప్, రమేశ్‌జార్కిహొళి నుంచి పలుమార్లు నగదు పొందారని వెల్లడించారు. ఎమ్మెల్యే ఎంవీ నాగరాజ్ కూడా సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇలా కేసు విచారణ దశలో ఉన్నందున ఆరోపితులకు బెయిల్ ఇవ్వరాదని సిట్ అధికారులు కోర్టుకు విన్నవించారు. దీంతో సీడీ కేసు మరో మలుపు తిరిగింది.
కర్ణాటక అప్పటి మంత్రి రమేశ్ జార్కిహోళి సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. రమేశ్ జార్కిహొళి యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియో మీడియాలో చక్కర్లు కొట్టింది. బెంగళూరు ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మంత్రి రమేశ్ జార్కి హోళి ఆశ్రయించింది. అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందనేది మంత్రిపై ఆరోపణ. అయితే తనకు సంబంధంలేదని కావాలనే తనను ఇరికించారని ఆయన తెలిపారు. సీడీ బయటకు రావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీట్ దర్యాప్తు చేస్తోంది.