న్యూ ఇయర్ వినోదం విషాదం కాకూడదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. నేటి రాత్రి 12 తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా సజ్జనార్ విలువైన సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలను మీ ఇంట్లో కుటుంబసభ్యులతో జరుపుకోవాలని.. ప్రమాదాలకు దూరంగా సంతోషంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గతంలో న్యూ ఇయర్ వేడుకలు మిగిల్చిన విషాదాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
న్యూ ఇయర్ ఎంజాయ్ పేరుతో మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు మీరు కారకులు కారాదని హితవు పలికారు. అందుకే కొత్త సంవత్సరం వేడుకలను సురక్షితంగా ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీ న్యూ ఇయర్‌ను రోడ్డు ప్రమాదరహితంగా ప్రారంభించండి! మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దు. బైక్ రేసింగులు అత్యంత ప్రమాదకరం, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం..తల్లిదండ్రుల్లారా! కొత్త ఏడాది పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు’ అని హెచ్చరించారు.