ముఖానికి మేకప్ వేసుకునే అలవాటు మీకుంటే ఆ మేకప్ ని సరైన సమయంలో తొలగించుకోవడం కూడా మీకు తెలియాలి. మేకప్ వేసుకుని తొలగించుకోవడం మర్చిపోయి అలాగే ఉన్నారంటే చర్మ సమస్యలు చుట్టుకుంటాయి.
సాధారణంగా ప్రతీరోజూ మేకప్ వేసుకునే వాళ్ళకు ఏ సమయంలో మేకప్ తీసివేయాలో తెలిసి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు వేసుకునే వారు మాత్రం దీనిపై అవగాహన కలిగి ఉండాలి.
మేకప్ వేసుకుని ఎంత సేపు ఉండవచ్చు:
ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత దాదాపు 6-8 గంటలు తొలగించుకోకుండా ఉండవచ్చు. అంతకన్నా ఎక్కువ సేపు తొలగించుకోకుండా ఉంటే లేని పోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా చికాకు పెరుగుతుంది. చర్మం మీద దద్దుర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంతే కాదు చర్మం ఎర్రగా మారిపోవడం జరుగుతుంది. ఇంకా చర్మం డల్లుగా మారిపోయి దాని మెరుపును కోల్పోయే ప్రమాదం ఎక్కువ. మొటిమలు రావడం, ముడతలు ఏర్పడటం, చర్మం పొడిబారడం, చర్మం మీద పగుళ్ళు ఏర్పడటం వంటివి మేకప్ ఎక్కువ సేపు ఉంచుకోవడం వల్ల జరుగుతాయి.
అయితే పై లక్షణాలన్నీ మీ చర్మరకం మీద ఆధారపడి ఉంటాయి. సున్నితమైన చర్మమైతే పై లక్షణాలన్నీ కనిపించే అవకాశం ఉంది.
మరో విషయం ఏంటంటే.. మీ చర్మ రకానికి ఏ రకమైన మేకప్ ఉత్పత్తులు సరిపోతాయో వాటిని మాత్రమే వాడాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. దానికోసం మీరు మీ చర్మరకం మీద ఉత్పత్తులను ట్రయల్ చేసిన తర్వాత మాత్రమే వాడాలి.