అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగిన బౌలర్లలో టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ ఒకడు. తన ఇన్, అవుట్ స్వింగ్ తో బ్యాట్స్మెన్ ని ముప్పతిప్పలు పెట్టె ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కి దూరమయ్యాడు. 2012 తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ లో కనపడలేదు. దీనితో అప్పటి నుంచి అతని కెరీర్ ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ తర్వాత ఐపియల్ కి కూడా దూరమయ్యాడు.
అయితే ఒకానొక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అంటూ ప్రవీణ్ కుమార్ జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో ఆసక్తికర విషయాలు చెప్పాడు. 2018 లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన కుమార్, నిరాశతో బాధపడుతూ కొన్ని నెలల క్రితం తన జీవితాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 2019 నవంబరులో అర్ధరాత్రి రివాల్వర్‌తో తన ఇంటి నుండి బయలుదేరినప్పుడు,
తన కెరీర్ విషయాలు అన్నీ తలుచుకుని, ఇవన్ని ఎందుకు, ఏంటీ అనే ప్రశ్నతో జీవితాన్ని అంతం చేద్దాం అనుకున్నా అని, ఆ తర్వాత కారులో తన పిల్లల మొహం చూసి వెనక్కు తగ్గినట్టు చెప్పాడు. వాళ్ళు అమాయకులు అని, అనాధలు అయిపోతారని అందుకే వెనక్కు తగ్గినట్టు కుమార్ వివరించాడు. హరిద్వార్‌కు వెళ్లే రహదారిపై తన కారును నడుపుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడట.
అదే విధంగా తన జీవితంలో అనుభవించిన కొన్ని క్లిష్ట పరిస్థితుల గురించి వివరించాడు. ఇంగ్లాండ్ లో తాను ఆడినప్పుడు ఎంతో మెచ్చుకున్నారని, ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా గాని అవకాశాలు రాలేదని, డిప్రెషన్ తో నరకం చూసా అని భారత్ లో డిప్రెషన్ ని ఎవరూ అర్ధం చేసుకోలేరని అసలు దాని గురించి ఎవరికి తెలియదని చెప్పుకొచ్చాడు ప్రవీణ్ కుమార్.