ముంబై వాసులను ఓ వైపు కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరోవైపు తాజాగా నిసర్గ తుఫాన్ భయపెడుతోంది. ఇప్పటికే తీరం దాటిన తుఫాను విజృంభిస్తోంది. ముంబై నగరంలో ఎటు చూసినా చెట్లు కూలి, స్తంభాలు విరిగిపోయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక బృందాలు ఎప్పటికప్పుడు సహాయక కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాయి. అయితే తుఫాను నేపథ్యంలో అధికారులు ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అనే వివరాల జాబితాను వారు విడుదల చేశారు. వాటిలోని విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే…
నిసర్గ తుఫాను నేపథ్యంలో చేయకూడనివి…
* సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. ఏ వార్తనైనా నమ్మేముందు అది నిజమా, కాదా అనే విషయం నిర్దారించుకోవాలి. తుఫాను అని చెప్పి భయం చెందవద్దు. ధైర్యంగా ఉండాలి.
* ఎట్టి పరిస్థితిలోనూ కాలు బయట పెట్టవద్దు. ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్లడం, వాహనాలు నడపడం చేయరాదు.
* కూలిన భవనాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలి.
* తుఫాను నేపథ్యంలో గాయాలకు గురైన వారిని ఎలా పడితే అలా ఆస్పత్రికి తీసుకెళ్లవద్దు. నిపుణుల సహాయం తీసుకోవాలి.
* అగ్ని ప్రమాదాలను కలగజేసే వస్తువులకు దూరంగా ఉండాలి.
చేయాల్సినవి…
* 1916 నంబర్‌కు ఫోన్ చేసి 4 నంబర్ ప్రెస్ చేసి తుఫాన్ నేపథ్యంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రజలు అధికారులను తుఫాన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు.
* మొబైల్ ఫోన్లు పూర్తిగా చార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. పవర్ బ్యాంక్‌లకు పూర్తిగా చార్జింగ్ పెట్టుకోవాలి.
* టార్చిలైట్‌లు, అత్యవసర లైట్లు వెలిగించుకోవాలి.
* గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇంట్లో కరెంటు మెయిన్ ఆఫ్ చేయాలి.
* ముఖ్యమైన పత్రాలు, కరెన్సీ, ఇతర విలువైన వస్తువులను నీరు చేరని ప్లాస్టిక్ బాక్సుల్లో భద్ర పరుచుకోవాలి.
* కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలి. వాటిని మూసేయాలి.
* ఇంటి మధ్య భాగంలోనే ఉండాలి.
* బలమైన ఫర్నిచర్ కింద తలదాచుకోవాలి.
* కరెంటు వైర్లు తెగిపడినా.. ఇతర విద్యుత్ సమస్యలు ఏర్పడినా.. వెంటనే ఆ శాఖ అధికారులు లేదా సిబ్బందికి ఫోన్ చేసి చెప్పాలి.