ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకునే వారికి నిజంగా గడ్డుకాలమే. ఎందుకంటే.. ఇంకో 3 నెలల వరకు ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయంలో వివాహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఎవరి జీవితంలోనైనా సరే.. వివాహం అనేది కేవలం ఒక్క సారి మాత్రమే వచ్చే గొప్ప శుభకార్యం. అందుకని దాన్ని బలమైన ముహుర్తంతో జరుపుకోవాలని చూస్తుంటారు. అందులో భాగంగానే వధూవరుల జాతకాలను బట్టి పండితులు ముహూర్తాలను నిర్ణయిస్తుంటారు. ముహూర్తం అనేది ఒక జంట 100 ఏళ్ల అన్యోన్య దాంపత్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకునే వారికి నిజంగా గడ్డుకాలమే. ఎందుకంటే.. ఇంకో 3 నెలల వరకు ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.
వచ్చే నెల.. అంటే జూలై 2వ తేదీన ఆషాఢ మాసం మొదలవుతుంది. సాధారణంగా ఆ మాసంలో వివాహాది శుభ కార్యాలను జరిపించరు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీ వరకు ఆషాఢం ఉంటుంది. అయితే ఆషాఢం తరువాత వచ్చే శ్రావణ మాసం నిజానికి వివాహాలకు అనులకూమే అయినా.. ఆ నెలలో శుక్ర మూఢమి ఉంటుంది. దీంతో మరో 3 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు. మూఢమి 3 నెలలు ఉంటుంది కనుక ఆ సమయంలో వివాహాది శుభాకార్యాలు చేయడం కుదరదు. కాగా జూలై 7వ తేదీన రాత్రి 2.38 గంటలకు శుక్ర మూఢమి ప్రారంభమై సెప్టెంబర్ 20వ తేదీన ఉదయం 6.07 గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత అక్టోబర్ 2 నుంచి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అంటే.. దాదాపుగా మరో 3 నెలల వరకు ముహూర్తాలు లేనట్లే.
ఇక డిసెంబర్‌లో మళ్లీ గురు మూఢమి వస్తుంది. డిసెంబర్ 13 రాత్రి 1.11 గంటల నుంచి 2020 జనవరి 10వ తేదీ రాత్రి 10.23 గంటల వరకు మూఢమి కొనసాగుతుంది. దీంతో ఆ సమయంలోనూ ముహూర్తాలకు వీలు కాదు. అయితే సహజంగా ఏడాదిలో రెండు మూఢాలు వస్తాయి. అవి గురు మూఢమి, శుక్ర మూఢమి. గురువు సూర్యునితో కలిసి ఉండే కాలాన్ని గురు మూఢమి అంటే.. శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే కాలాన్ని శుక్ర మూఢమి అంటారు. ఈ విధంగా మూఢమిలు వస్తే ఆ సమయంలో ఆయా గ్రహాలు బలహీనంగా ఉంటాయి. దీంతో ఆ సమయాల్లో శుభకార్యాలు చేయడం వీలు కాదు. ఏది ఏమైనా.. మరో 3 నెలల పాటు ముహూర్తాలు లేకపోవడం.. నిజంగా నూతన వధూవరులకు చేదువార్తే కదా..!