విద్యార్థులకు అలర్ట్‌.. ఇక నుంచి హాస్టల్‌లో నాన్‌వెబ్‌ బంద్‌..

-

విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ షాక్‌ ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్‌ కళాశాల హాస్టల్‌, క్యాంటీన్‌లో మాంసాహారాన్ని నిషేధించినట్లు పిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రమ తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల పాటు కళాశాల హాస్టల్‌, క్యాంటీన్లు తెరచుకోలేదు. నిజానికి కొవిడ్‌ వ్యాప్తికి కొద్ది రోజుల ముందే కళాశాలలో నాన్‌వెజ్‌కు స్వస్తి చెప్పారు. ఆఫ్‌లైన్‌లో క్లాసులు ప్రారంభమైన తర్వాత కూడా దాన్నే కొనసాగించారు. తాజాగా ప్రిన్సిపాల్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ గత మూడునాలుగేళ్ల కిందటే కళాశాల హాస్టల్‌, క్యాంటీన్‌లో మాంసాహార భోజనాన్ని నిలిపివేశాం. అయితే, నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులతో ఒక మాట చెప్పి ఉండాల్సింది. ఆ తర్వాత ఆచరణలోకి తీసుకురావాల్సింది. అందుకే మీడియా సమక్షంలో నిర్ణయాన్ని చెబుతున్నాం.’’ అని ఆమె అన్నారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పారు.

ఇదే విషయంలో గత ఏడాది జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీరామనవమి రోజున కళాశాల క్యాంటీన్‌లో లెఫ్ట్‌ పార్టీ సానుభూతి పరులైన కొందరు విద్యార్థులు మాంసాహార భోజనం తింటుండగా ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్‌)కి చెందిన విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉద్దేశ పూర్వకంగానే వారు మాంసాహారం వండించారని, అంతేకాకుండా శ్రీరామనవమి ప్రార్థనలను అడ్డుకున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కావేరీ హాస్టల్‌ వార్డెన్‌పై కొందరు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే మాంసాహారాన్ని పూర్తిగా నిషేధిస్తూ హంసరాజ్‌ కళాశాల యాజమాన్యం తాజాగా మరోసారి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version