రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహణపర్వం బుధవారంతో ముగిసింది. దాంతో గురువారం నుంచి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగనుంది. ప్రచార రథాలు, కార్యకర్తల నినాదాలు, నేతల ఉపన్యాసాలు, ఇంటింటి ప్రచారం, బైక్ ర్యాలీలులతో గ్రామాలు, పట్టణాలలో ఎన్నికల సందడి మొదలుకానుంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి ధీమా వారిదే. పోటీ పోటీగా ప్రచారాలతో ఎన్నికల ప్రచారం ఒక్కసారి ఊపందుకోనుంది. బిఆర్‌ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటించడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా నియోజకవర్గాలలో ప్రత్యర్థి ఎవరో తెలియక బిఆర్‌ఎస్ అభ్యర్థులే ప్రచారం నిర్వహించుకుంటున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అభ్యర్థులను సంబంధించిన ప్రచారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్(ట్విట్టర్),ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో అప్‌డేట్ చేస్తూ కేడర్, కార్యకర్తలను నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీల నుంచి పోటీలో ఉంటున్న అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలను సోషల్ మీడియాలోనే ధీటుగా సమాధానం ఇస్తూ అంటే ధీటుగా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అభ్యర్థులు తమ నియోజకవర్గాలవారీగా అవసరం మేరకు సోషల్ మీడియా నిర్వహణలో నైపుణ్యం కలిగిన యువకులను నియమించుకుని వారి పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా యువతకు వేగంగా సమాచారాన్ని చేరవేయగల ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రచారాన్ని వేడిక్కిస్తున్నారు. తమ పోస్టులకు లైక్‌లు, కామెంట్లు చేస్తూ షేర్ చేసేలా కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచారు. ఓవరాల్ జిహెచ్ఎంసీ పరిధిలో 15 స్థానాలకు 312 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. నాంపల్లిలో అత్యధికంగా 34 మంది, ముషీరాబాద్లో 31 మంది, మలక్ పేట్, యాకత్ పురాలో 27 మంది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు.