ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలి: మంత్రి ఎర్రబెల్లి

-

కాంగ్రెసోల్లు దొంగలని, వారు పాలించే రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత గొల్లకుర్మలు ఒగ్గు డోలు విన్యాసాలు, బోనాలు, శివసత్తుల పూనకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లికి మేకపిల్ల, గొంగడి బహూకరించారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలని, తొందరపడి ఓటు వేయొద్దన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన లో గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గొల్ల కుర్మలకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. గొర్రెల యూనిట్ల ను అత్యధికంగా పాలకుర్తిలో పంపిణీ చేశానన్నారు.

సీఎం కేసీఆర్​తోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుందని, కేసీఆర్​ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కోరారు. సీఎం కేసీఆర్​ చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుతో పాటు పాలకుర్తి ఆర్డీవో డివిజన్ చేయాలని, రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. అలాగే చిందు, యక్ష గాన కళాకారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. సంచార జాతుల కోసం రూ.5 కోట్లతో బిల్డింగ్​ కడుతున్నట్లు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version