హైదరాబాద్ః అధికార పార్టీ నేత, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు ప్రత్యేక న్యాయస్థానం తాజాగా ఝలక్ ఇచ్చింది. 2012 నాటి ఓ కేసులో భాగంగా ఆయన న్యాయస్థానం ముందు హాజరుకాకపోవడంతో స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. వినయ్ భాస్కర్‌తో పాటు మరో ఎనిమిది మంది ప్రజాప్రతినిధులకు సైతం న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. ఈ కేసులు వీరిపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా 2012లో నమోదయ్యాయి.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2012లో వినయ్ భాస్కర్ సహా మరికొంత మంది ప్రజాప్రతినిధులు కాజీపేటలో రైలు రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఏడుగురికి ఫిబ్రవరి 10వరకు రిమాండ్ విధించింది. అయితే, వినయ్ భాస్కర్ సహా మరో ఇద్దరి అచూకీ తెలియడం లేదని పోలీసులు కోర్టుకు వెల్లడించడంతో ఫిబ్రవరి 3 లోగా నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేయాలని కోర్టు పేర్కొంటూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.