ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్ల (Mangos) వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోనే ఒక్కో రాష్ట్రంలో భిన్న రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. కొన్ని రసాలు అయితే కొన్ని కోత మామిడి కాయలు. దేని ప్రత్యేకత దానిదే. ఈ క్రమంలోనే వెరైటీని బట్టి వాటి ధర ఉంటుంది. అయితే గుజరాత్‌కు చెందిన ఆ వెరైటీ మామిడి కాయల ధర మాత్రం ఒక్కోటి రూ.1000 వరకు పలుకుతోంది. ఇంతకీ ఆ మామిడికాయలు ఏ వెరైటీకి చెందుతాయి అంటే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అలిరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో నూర్జహాన్ అనే వెరైటీకి చెందిన మామిడికాయలను పండిస్తున్నారు. నిజానికి ఈ వెరైటీ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినది. శివరాజ్ సింగ్ జాదవ్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో మూడు నూర్జహాన్ వెరైటీ మామిడి చెట్లను పెంచుతున్నాడు. వాటికి కాయలు కాస్తున్నాయి. ఈ ఏడాది ఒక్కో చెట్టుకు దాదాపుగా 250 మామిడికాయలు పండాయి. అవి కోత మామిడిలా ఉంటాయి. ఇక ఒక్కో మామిడికాయ రూ.1000 వరకు అమ్ముడవుతోంది. ఈ క్రమంలోనే అన్ని మామిడికాయలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. చాలా మంది వాటిని ఆర్డర్ మీద బుక్ చేసుకున్నారు. త్వరలోనే వాటిని డెలివరీ చేయనున్నారు.
ఈ వెరైటీకి చెందిన మామిడి కాయలు ఒక్కోటి 2 కిలోల నుంచి 3.50 కిలోల వరకు బరువు పెరుగుతాయి. చాలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి. అలాంటి రుచి ఇతర మామిడి పండ్లకు రాదు. అందుకనే ఈ వెరైటీ అంతటి ధర పలుకుతుంది. ఇక కోవిడ్ వల్ల ఈ సారి కాయల ధర తగ్గిందని శివరాజ్ సింగ్ తెలిపాడు. సాధారణంగా ఒక్కో కాయ రూ.1200 కు అమ్ముడవుతుందని తెలిపాడు. కాగా ఈ చెట్లకు జనవరి నుంచి ఫిబ్రవరి నెల మధ్యలో పూత వస్తుంది. జూన్ వరకు కాయలు అందుబాటులోకి వస్తాయి. ఈ కాయలు ఒక్కోటి ఒక అడుగు వరకు పొడవు ఉంటాయి.