ఆ దేశాలకు ఉత్తర కొరియా వార్నింగ్ .. మరోసారి క్షిపణి పరీక్ష చేపట్టి కవ్వింపు

-

ఉత్తర కొరియా మరోసారి ప్రపంచాన్ని భయపెట్టే చర్యలకు పాల్పడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని సముద్రం వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడింది.

దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకొంది. అదే సమయంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ద.కొరియాను సందర్శించనున్నారు.

ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష తీవ్రమైన కవ్వింపు చర్య అని సియోల్‌ వర్గాలు ఆరోపించాయి. తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ద.కొరియా పేర్కొంది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని పేర్కొంది. మరోవైపు జపాన్‌ కోస్టు గార్డులు కూడా ఈ క్షిపణి పరీక్షను ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version