దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఇతర ముఖ్యమైన రహదారుల్లో టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల వాహనదారులు చాలా త్వరగా టోల్ గేట్ గుండా వెళ్లవచ్చు. అలాగే టోల్ చార్జిల చెల్లింపులకు చిల్లర లేదనే ఇబ్బంది ఉండదు. ఫాస్టాగ్ ద్వారానే ఆటోమేటిగ్గా ఆ మొత్తం కట్ అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ను వాడే వారికి శుభవార్త చెప్పింది.
ఫాస్టాగ్‌ను ఉన్న వాహనదారులకు ఇకపై టోల్ చార్జిలను చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తారు. కేవలం ఫాస్టాగ్ ఉన్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. దేశంలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలియజేసింది. హైవేలపై ఏర్పడే రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనూ ఈ విధంగా ఫాస్టాగ్ ఉన్నవారికి రాయితీలను ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.
ఇకపై హైవేలపై టోల్ గేట్ల గుండా వెళ్తే రిటర్న్ జర్నీని 24 గంటల్లో పూర్తి చేస్తే అలాంటి వారిలో ఫాస్టాగ్ ఉన్నవారికి రాయితీలు వస్తాయి. దీంతోపాటు స్థానికులకు కూడా మినహాయింపులు ఉంటాయి. అయితే రాయితీలు ఆటోమేటిగ్గా ఫాస్టాగ్‌లో జమ అవుతాయని, అందుకు ఎలాంటి రశీదును ఇవ్వరని కేంద్రం తెలిపింది. కనుక వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫాస్టాగ్ లేని వారు త్వరగా ఫాస్టాగ్ తీసుకోవాలని సూచించింది.