ఓలా బైక్స్ మీద ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో ఎలక్రిక్స్ బైకు చాలా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు సర్వీస్, బ్యాటరీ సమస్యలు, ఉన్నట్టుండి బైకులో నుంచి పొగలు వచ్చి పూర్తిగా కాలిపోవడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఫలితంగా బైక్ కలిగిన వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. షోరూమ్ వారిని అడిగితే వారి నుంచి సరైన స్పందన రావడం లేదని కస్టమర్స్ వాపోతున్నారు.
ఈ క్రమంలోనే ఓలా ఈవీ షోరూమ్‌కు చెప్పుల దండ వేసి ఓ కస్టమర్ నిరసన తెలిపాడు. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో షోరూమ్‌లో సర్వీస్ కోసం తన వాహనాన్ని కస్టమర్ ఇచ్చినట్లు సమాచారం. వెంటనే రిపేర్ చేసి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకుంటున్నారని, ఓలాని బ్యాన్ చేయాలంటూ సదరు కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లింగంపల్లి పరిధిలోని అశోక్‌నగర్‌లో తాజాగా వెలుగుచూసింది.