ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తనదైన ముద్ర వేసిన ఓలా.. ఇప్పుడు అదే విభాగంలో మరో ప్రాడక్ట్ తో ముందుకు వస్తోంది. అదే ఓలా ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తోందని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ కారు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు రయ్ రయ్ మంటూ సాగుతోందట. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తమ తొలి స్కూటర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి తమ విద్యుత్తు కారు ఆవిష్కరిస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ మూడు సరికొత్త మోడళ్ల ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్లలో 2170 లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుందని.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణించవచ్చని సమాచారం. ఈ కార్లపై అంచనాలను పెంచేలా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ ఇటీవల ట్వీట్ చేశారు. అధునాతన ఫీచర్లతో ఈ కార్లు వస్తాయని ఆయన తెలిపారు. కూప్, సెడాన్, ఎస్ యూ వీ అనే మూడు బాడీ మోడళ్లలో ఈ కార్లు వచ్చే అవకాశం ఉందని వాహన మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కార్ల తయారీ రంగంలోకి తాము ప్రవేశించనున్నట్లు భవీష్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో జూన్‌లో ఓలా తమ కారుకి సంబంధించిన టీజర్‌ను ట్వీట్ చేసింది. వెనుక, ముందు భాగం డిజైన్‌లను అందులో బహిర్గతం చేసింది. ఓలా అలే లోగో కూడా అందులో కనిపించింది. డిజైన్‌ను బట్టి సెడాన్ సెగ్మెంట్‌లో ఈ కారును విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన ఓలా 1,000 ఎకరాల స్థలం కోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది.