ఈ నెల 5వ తేదీన సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఏర్పాట్లను పరిశీలించారు.కాగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదోని కి రావడం ఎంతో శుభసూచికం అన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని పాండవగల్లు గ్రామస్తులు నిర్ణయించారు. తమ గ్రామ చెరువు కింద ఉన్న 20 ఎకరాల భూమిని స్థానిక నేతలు, అధికారులు అండదండలతో ఆక్రమించుకున్నారని వాపోయారు. ఆక్రమణలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, అందుకే జగన్ పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ గ్రామ చెరువును ఆక్రమనదారుల చెర నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.