న్యూ ఇయర్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోడ్డు వినియోగదారుల భద్రతా దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి 1 జనవరి 2025 తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మీడియం, హెవీ గూడ్స్ వాహనాలకు యధావిధిగా అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే ప్రయాణ టికెట్లు చూపిస్తే విమానాశ్రయానికి వెళ్లాల్సిన కార్లును అనుమతిస్తామని తెలిపారు.
నాగోల్ ప్లె ఓవర్, కామినేని ప్లై ఓవర్, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డులో మల్టీ లెవల్ ఫ్లైఓవర్, బైరామల్ గూడ ఎక్స్ రోడ్ (సాగర్ రింగ్ రోడ్డు), ఎల్బీనగర్ అండర్ పాస్, చింతల కుంట అండర్ పాస్ లోని మొదటి, రెండో లెవల్ ప్లె ఓవర్లపై లైట్ మోటార్, టూవీలర్, ప్యాసింజర్ వాహనాలను అనుమతి ఇవ్వబోమని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి 1 జనవరి 2025 తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే మీడియం, హెవీ గూడ్స్ వాహనాలను అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ ఆంక్షల నేపథ్యంలో తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలు పెట్టుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.