స్థానికాన్ని మించిన పోరు.. ఏపీలో మ‌రో ర‌గ‌డ..!

-

ఏపీలో మ‌రో ఆసక్తిక‌ర పోరు తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌భుత్వానికి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెరిగిపోయింది. గ‌త మార్చిలో నిర్వ‌హించాల్సిన స్థానిక ఎన్నిక‌ల‌ను క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేస్తున్నాన‌ని హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించ‌డంతో అధికార పార్టీ ఫైరైంది. ఇది ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు – ప్రభుత్వానికి మ‌ధ్య గ్యాప్ పెంచేసింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి.. ఎన్నికల క‌మిష‌న‌ర్‌.. ఎన్నికల‌కు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి.. చర్చిద్దాం రండి అంటూ .. సీఎస్‌ను కూడా పిలిపించారు.

కానీ, సీఎస్ వెళ్ల‌క‌పోగా.. ఇప్ప‌ట్లో ఎన్నిక‌ల‌కు కుద‌ర‌ద‌ని ఖ‌రాఖండీగా ప్ర‌క‌టించేసింది. అంతేకాదు.. క‌రోనా తీవ్రత త‌గ్గ‌లేద‌ని కూడా పేర్కొంది. అయితే.. ఈ ఎపిసోడ్‌లో చిత్రం ఏంటంటే.. ప్ర‌భుత్వం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌మ‌న్న‌ప్పుడు.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ‌ద్ద‌ని, ఆయ‌న నిర్వ‌హిస్తాన‌న్న‌ప్పుడు.. ప్ర‌భుత్వం వ‌ద్ద‌ని ఒక‌రికొక‌రు మెలిక‌లు పెట్టుకుని వివాదం చేసుకుంటున్నారు. ఇప్పుడు మ‌రి ఇది ఎటు దారితీస్తుంది ? ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుంది ? అనేది కీల‌క ప్ర‌శ్న‌. నిజానికి స్థానిక ఎన్నిక‌లంటే.. భారీ ఎత్తున వివాదాలు.. ప్ర‌చారాలు.. ర‌గ‌డ.. వంటివి తెర‌మీదికి వ‌స్తాయి. కానీ, ఎన్నిక‌లు లేకుండానే.. వివాదం రావ‌డం గ‌మ‌నార్హం.

ఈ రెండు ప్ర‌ధాన విభాగాల వివాదాన్ని ప‌రిశీలిస్తే.. ఇగో త‌ప్ప‌.. మ‌రేమీలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎట్టి ప‌రిస్థితిలోనూ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ఉన్నంత వ‌ర‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేది లేద‌ని గ‌తంలోనే వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేయ‌డం ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పైగా మంత్రులు కూడా మ‌ళ్లీ నిమ్మ‌గ‌డ్డ కేంద్రంగా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలా ప్ర‌భుత్వం వైపు  నుంచి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే.. నిమ్మగ‌డ్డ మాత్రం వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు మేధావులు.

ఫ‌స్ట్ ఆయ‌న తాను ఎన్నిక‌లు పెట్టాలనుకున్న‌ప్పుడు.. అఖిల‌ప‌క్షం నిర్వ‌హించారు. త‌ర్వాత ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు.. ఇక్క‌డ ఆయ‌న‌కు పాజిటివిటీ లేక‌పోతే.. మ‌రోసారి హైకోర్టుకు వెళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉన్న అన్ని మార్గాల‌ను ఆయ‌న చ‌క్క‌గా వినియోగించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్‌లో రేపు స‌ర్కారే దోషిగా నిల‌బ‌డే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version