ఆ ఐఏఎస్ విపక్షాలకు టార్గెట్‌ అయ్యారా…?

-

హైదరాబాద్‌ వరద బాధితులకు నగదు పంపిణీ విషయంలో విపక్షాలకు ఆ ఐఏఎస్ ఎందుకు టార్గెట్‌ అయ్యారు? రాజకీయ ఒత్తిళ్లతో పొరపాట్లు చేశారా..విమర్శలకు ఆయనే అవకాశం కల్పించారా అన్నదాని పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కోటి మంది జనాభా. వేల మంది యంత్రాంగం. ఏ పని చేయాలన్నాజీహెచ్ ఎంసీ అధికారులదే బాధ్యత. అలాంటిది నగరంలో వరద సాయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్‌ గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చేయాల్సిన పనులను ప్రజాప్రతినిధులకు అప్పగించేసి కామ్‌గా ఉండిపోవడం రాజకీయ దుమారం రేపుతోంది.

ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలైన డబ్బులను అర్హులైన బాధితులకు అధికారులే అందజేయాలి. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని జోనల్‌ కమిషనర్లు, కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించారు కమిషనర్‌ లోకేష్‌కుమార్‌. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రతిపక్ష పార్టీలు. ఏకంగా ఆఫీసులకు వచ్చి నాయకులు నిలదీస్తుంటే బిక్క ముఖాలు పెట్టారు జీహెచ్ ఎంసీ అధికారులు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉన్నాయి. అన్నిచోట్లా వరదలు రాకపోయినా అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారనే విమర్శలున్నాయి. వాస్తవానికి బాధితులను గుర్తించి లిస్ట్‌ తయారు చేయాలి. అలాంటివి ఏమీ లేకుండానే.. ఆధార్‌కార్డు ఉంటే చాలు అన్నట్టు మార్చేశారు. దీంతో మొత్తం ప్రక్రియ ఆరోపణలకు, ధర్నాలకు, గందరగోళానికి దారితీసింది. ఇప్పటికీ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్యాలయాల ముందు బాధితులు నిరసనలు చేపడుతున్నారు.

త్వరలో గ్రేటర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్‌లో కార్పొరేటర్లతో డబ్బులు అందజేయడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా కార్పొరేటర్లకు, టీఆర్‌ఎస్‌ నేతలకు ఈ పని అప్పగించి.. కమిషనర్‌ చేతులు దులిపేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. బాధితులకు ఇచ్చేందుకు 550 కోట్లు విడుదల చేస్తే ఈ నెల 3కే 387 కోట్లు పంచేశారట. ఇప్పుడిప్పుడే రెండో విడత జోరందుకుంది. మధ్యలో మూడు రోజులపాటు పంపకాలు ఆపేశారు. సాయం పంపిణీ విషయంలో కమిషనర్‌ అలసత్వం చూపించారా లేక అధికార పార్టీనేతలు ఒత్తిడి తెచ్చారో కారణమేదైనా ప్రతిపక్షాలకు మాత్రం ఆయన టార్గెట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version