రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఉదయం సంచలన ట్వీట్ చేశారు. ‘కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది.
కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుంది.అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు. హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు.మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన.
ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం.ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా.
గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం.ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు’ వంటి సమస్యలను హైలైట్ చేసిన పేపర్ క్లిప్పింగులను కేటీఆర్ తన ట్వీట్‌కు జతపరిచాడు.