ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా రూపాంతరం చెందడంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, వైఎస్సార్, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని పేర్కొంది.
కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు, నదులు, రిజర్వయర్ల వద్ద కింది స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను అంచనా వేయాలని, సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ముందస్తు సూచనలు చేసింది.