నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న భీమ్ (BHIM) యాప్ యూజర్ల డేటా లీకయ్యింది. ఫిబ్రవరి 2019 నెలకు చెందిన యూజర్ల డేటా లీక్ అయినట్లు సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ మేరకు వీపీఎన్ మెంటార్ అనబడే వీపీఎన్ రివ్యూ వెబ్‌సైట్ టీం డేటా లీక్ అయినట్లు నిర్దారించింది.
అయితే ఈ విషయాన్ని భీమ్ యాప్‌ను నిర్వహిస్తున్న సీఎస్‌సీ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు తెలిపామని.. కానీ వారు స్పందించకపోవడంతో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సర్ట్-ఇన్)కు ఒకే నెలలో రెండు సార్లు చెప్పామని.. సదరు వెబ్‌సైట్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. దీంతో భీమ్ యాప్‌లో ఉన్న లోపాన్ని సరిచేశారన్నారు. అయినప్పటికీ మొత్తం 72.60 లక్షల మంది భీమ్ యూజర్ల డేటా లీక్ అయిందని.. దాంతో వారి భీమ్ అకౌంట్లకు ముప్పు పొంచి ఉందని తెలిపారు.
భీమ్ యాప్ యూజర్లకు చెందిన పేర్లు, పుట్టిన తేదీ, లింగం, ఇంటి చిరునామా, కులం, ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు లీక్ అయ్యాయని వారు తెలిపారు. ఇక ఫిబ్రవరి 2019 నెలకు చెందిన డేటా మాత్రమే లీక్ అయినప్పటికీ అది 409 జీబీ వరకు సైజ్ ఉంటుందని, ఆ డేటా హ్యాకర్ల బారిన పడితే ఆ యూజర్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ముప్పు పొంచి ఉంటుందని చెబుతున్నారు. కాగా ఈ విషయంపై సర్ట్-ఇన్ మరింత లోతుగా విచారణ చేస్తోంది. ఇక 2016లో నోట్ల రద్దు అనంతరం డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు భీమ్ యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఆ యాప్ వాడకం ఎక్కువైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ యాప్‌కు చెందిన యూజర్ల డేటా లీకవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.