పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణానికి భారతదేశం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ దాడికి తగిన ప్రతీకారం తప్పదన్న సంకేతాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. దేశవ్యాప్తంగా ప్రజలు పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుండగా, తెలంగాణలోనూ మానవత్వాన్ని నిలబెట్టే స్ఫూర్తిదాయక సంఘటన జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు మంత్రులు, నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నడిచి, ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “పర్యాటకులపై దాడి చేయడం అనేది మానవత్వాన్ని నాశనం చేసే చర్య. ఇలాంటి దాడులను ఖండిస్తూ, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అందరం ఒక్కటిగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతుగా నిలవాలి. దేశ భద్రత కోసం పార్టీలకతీతంగా కృషి చేయాల్సిన సమయం ఇది” అని పిలుపునిచ్చారు.