తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం చూపిస్తున్న వివక్షను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తప్పుబట్టింది. ఎందుకీ వివక్ష అంటూ నిలదీస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఓ ఘాటు లేఖ రాసింది. ఈ లేఖలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీటి కేటాయింపులకు లోబడే నిర్మిస్తున్నామని, అనుమతుల జారీలో జాప్యంతోపాటు.. కనీసం ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీటి కేటాయింపులకు అనుగుణంగా చేపట్టామని.. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవచ్చంటూ గోదావరి ట్రైబ్యునల్ తీర్పు సూచిస్తోందని పేర్కొన్నారు. ఆ మేరకు వచ్చే 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్‌లో మిగిలిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు.
కర్ణాటకలో కూడా ఇదే తరహాలో మైనర్ ఇరిగేషన్‌లో మిగిలిన జలాలు, పోలవరం ద్వారా కృష్ణా డెల్టా నుంచి లభించే వాటాలో జలాల ఆధారంగా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అధికారులు నీటి కేటాయింపులను ప్రతిపాదించారని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు అనుమతులిచ్చిందని, పైగా జాతీయ హోదా కల్పించి, కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా విడుదల చేసిందని తెలిపారు. ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.