నేటి నుంచి తెలంగాణలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే పల్లెప్రగతి ఐదో విడత, పట్టణప్రగతి నాలుగో విడతలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రధాన అంశాలు. అయితే ఈ నెల 18వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నీరు, విద్యుత్తు సౌకర్యం లేని వైకుంఠధామాలకు వెంటనే ఆ సౌకర్యాలు కల్పిస్తారు. పల్లె, పట్టణ ప్రగతి పర్యవేక్షణకు మండలానికి జిల్లా స్థాయి అధికారి, వార్డుకు ప్రత్యేక అధికారి, పంచాయతీకి మండలస్థాయి అధికారిని నియమించారు. పంచాయతీ, పట్టణ వార్డు, డివిజన్‌కు కమిటీలను ఏర్పాటుచేశారు. గ్రామ కమిటీలో సర్పంచ్ అధ్యక్షుడిగా ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్తు లైన్, మిషన్ భగీరథ టెక్నిషియన్ సభ్యులుగా ఉంటారు.
పట్టణస్థాయిలో వార్డు కమిటీల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, కలెక్టర్ నియమించిన వార్డు సూపర్‌వైజర్, మున్సిపల్ శానిటరీ ఉద్యోగి, మున్సిపల్ వాటర్ సప్లయ్ ఉద్యోగి ఉంటారు. పల్లె, పట్టణ ప్రగతిలో మొదటి రోజు గ్రామంలో పాదయాత్ర చేపట్టి గ్రామసభ నిర్వహించాలని మార్గదర్శకాలు జారీచేశారు. పట్టణ ప్రగతిలో మొదటి రోజు వార్డు సభ నిర్వహించి ప్రణాళిక తయారు చేస్తారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలు, గత విడతల్లో సాధించిన విజయాలను నివేదిక రూపంలో వార్డు, గ్రామ సభలో చదివి వినిపిస్తారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్టాండింగ్ కమిటీ సభ్యులంతా పాల్గొనేలా చూడాలి. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే సిద్ధం చేసిన క్రీడా ప్రాంగణాలను మొదటి రోజు ప్రారంభిస్తారు. మండలానికి కనీసం రెండు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.