వెలవెలబోయిన వాటికన్‌ సిటీ.. భక్తులు లేకుండానే పామ్‌ సండే

-

కరోనా కారణంగా ప్రఖ్యాత వాటికన్‌ సిటీ వెలవెలబోయింది. ప్రతి ఏడాది గుడ్‌ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల(పామ్‌) ఆదివారం ప్రార్థనలు భక్తులు లేకుండానే జరిగాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్‌ పీటర్స్‌ బసిలికా లోపలే నిర్వహించారు. దీంతో ఈస్టర్ వరకు జరిగే హోలీ వీక్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పోప్‌ ప్రాన్సిస్‌తో పాటుగా కేవలం 25 మంది మాత్రమే పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ఆందోళన నేపథ్యంలో వీరు భౌతిక దూరం పాటించారు.

ఈ సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ మానవాళి ఆశలపై నీళ్లు చల్లిందని, పెను భారాన్ని పెట్టిందని అన్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని సోషల్‌ మీడియా, టీవీలు ద్వారా లక్షలాది మంది వీక్షించారు. కాగా, ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి వేలాదిసంఖ్యలో భక్తులు హాజరయ్యేవారు.

ఇప్పటికే వాటికన్‌ సిటీలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. అయితే పోప్ ఫ్రాన్సిస్‌తోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులకు కరోనా వైరస్ నెగెటివ్ అని తేలింది. కాగా, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 69 వేల మృతిచెందారని గణంకాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version