కార్తీకంలో పంచారామ దర్శనం సర్వపాపహరం!

-

కార్తీకంలో శైవక్షేత్ర సందర్శనం పరమ పవిత్రం. వ్రతాలు, పూజలు, ఉపవాసాలు ఆచరించలేనివారు కనీసం శైవక్షేత్రాలను అయినా సందర్శిస్తే మంచినదని పండితులు చెప్తున్నారు. అటువంటి పరమ పవిత్ర క్షేత్రాలలో శైవ క్షేత్రాలలో పంచారామాలు ప్రముఖమైనవి. వాటి పుట్టక, ప్రాశస్త్ర్యం తెలుసుకుందాం… పంచారామాలుగా పేరొందిన ఓ అయిదు శైవక్షత్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటమే ఆశ్చర్యం. వీటి వెనుక గాథ…

తారాకాసురుని కథ!
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు, శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. పైగా బాలుని చేతిలో తప్ప అన్యుల చేత తనకు మరణం లేని వరాన్ని సైతం సాధించాడు. సహజంగానే రాక్షస ప్రవృత్తి ఉన్న తారకాసురుడు, ఈ వరాలన్నీ పొందగానే ముల్లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుని ధాటికి తట్టుకోలేని దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా, శివపార్వతుల తనయుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అన్న ఉపాయాన్ని సూచించాడు ఆ నారాయణుడు. అలా తారకాసురుని సంహరించేందుకు పార్వతీ గర్భాన జన్మిస్తాడు కుమారస్వామి.

దేవతలంతా తన మీద ఉంచిన బాధ్యతను గుర్తించిన కుమారస్వామి, తారకాసురుని సంహరించేందుకు యుద్ధానికి బయల్దేరతాడు. కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా అవి తారకాసురుని నాశనం చేయలేకపోవడం చూసి, కుమారస్వామి ఆశ్చర్యానికి అంతులేకుండా పోతుంది. చివరికి, తారకాసురుని శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే తప్ప, అతనికి చావు తప్పదని తెలుసుకున్న కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసురునికి మృత్యువు సంభవిస్తుంది. అలా కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం అయిదుచోట్ల పడిందనీ, ఆ అయిదు ప్రాంతాలే పంచారామాలుగా రూపొందాయన్నది ఐతిహ్యం.

పంచారామాలు ఇవే!!
అమరారామం (అమరావతి) – ఇక్కడి లింగం సాక్షాత్తూ ఆ ఇంద్రుని చేతే ప్రతిష్టింపబడిందన్నది స్థలపురాణం. బహుశా అందుకేనేమో ఇంద్రలోకపు రాజధాని అయిన అమరావతి పేరుతోనే ఈ క్షేత్రమూ ప్రచారంలో ఉంది. అంతేకాదు! కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా రాజధానిగా మారింది. పది అడుగులకు పైబడి ఉండే ఇక్కడి అమరలింగేశ్వరుని పూర్తిగా దర్శించుకోవాలంటే రెండంతస్తులుగా ఉన్న మెట్లను ఎక్కాల్సిందే. క్రిష్ణ నది ఒడ్డున ఉన్న ఏకైక పంచారామం క్షేత్రం ఇది.

ద్రాక్షారామము: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి అత్యంత సమీపంలో ఉండే ఈ ద్రాక్షారామం, పంచారామాల్లోనే అత్యంత ప్రముఖమైన శైవక్షేత్రం. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడంతో, ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందంటారు. ఇక్కడి భీమేశ్వరస్వామి సహచరి అయిన మాణిక్యాంబను అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తిస్తారు. అంతేకాదు దక్షిణకాశిగా, త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా (ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రైశైలం) ఈ ఆలయాన్ని గౌరవిస్తారు.

సోమారామము: పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి అతి సమీపంలో ఉన్న గునుపూడి అనే గ్రామంలో ఉన్న శివక్షేత్రమే సోమారామం. ఇక్కడి శివలింగం చంద్రుని చేత ప్రతిష్టింపబడింది కాబట్టి, ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు వచ్చింది. పేరుకి తగినట్లుగానే చంద్రుని కళలతో పాటుగా పౌర్ణమి, అమావాస్యలకు మధ్య ఇక్కడి శివలింగం రకరకాల రంగులలో మారడాన్ని భక్తులు ఓ అద్భుతంగా భావిస్తారు. చాళుక్య రాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి, ఈ పంచారామానికి భీమారామము అన్న పేరు కూడా ఉంది.

 

కుమారభీమారామం:  ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు అతి సమీపంలో ఉంది. కుమారస్వామి స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి కుమారారామమని పిలుచుకుంటారు. ఇక చాళుక్య రాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి కుమారభీమారామంగా పేరుపొందింది. చైత్ర, వైశాఖ మాసాల్లోని సూర్యకాంతి ఉదయపు వేళలలో అయ్యవారి పాదాలనీ, సాయం వేళలలో అమ్మవారి పాదాలనూ తాకడం ఇక్కడి విశేషం!

 

క్షీరారామము: ఇది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. సాక్షాత్తూ ఆ శ్రీరాముడే ఈ లింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి, ఇక్కడి స్వామికి రామలింగేశ్వరుడు అన్న పేరు స్థిరపడింది. ఇక ఇక్కడి శివలింగం తెల్లటి పాలరంగులో ఉంటుంది కాబట్టి, ఈయనను క్షీరారామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. శివలింగం పైభాగం కాస్త మొనదేలి ఉండటం వల్ల ఈయనకు కొప్పురామలింగేశ్వరుడు అనే పేరు కూడా ఉంది.

కార్తీకమాసంలో భక్తులు సులభంగా దర్శించడానికి ప్రత్యేక బస్సులు సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి.
– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version