దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ 5.0 లో భాగంగా కేంద్రం అనేక కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జూన్ 8 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు మళ్లీ ఓపెన్ కానున్నాయి. ఇక జూలై నుంచి స్కూళ్లను కూడా తెరవాలని చూస్తున్నారు. అందుకు గాను ఇప్పటికే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కసరత్తు కూడా చేస్తోంది. అయితే స్కూళ్లను ఓపెన్ చేసినా తమ పిల్లలను పంపేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కరోనా భయం వారిని వెంటాడుతోంది.
హైదరాబాద్‌కు చెందిన హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్‌పీఏ) తాజాగా నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేసింది. అందులో షాకింగ్ విషయం వెల్లడైంది. సర్వే చేసిన మొత్తం తల్లిదండ్రుల్లో 82 శాతం మంది తమ పిల్లలను ఇప్పటికప్పుడే స్కూళ్లకు పంపేందుకు సిద్ధంగా లేరని తేలింది. కరోనా పూర్తిగా తగ్గేవరకు లేదా దానికి వ్యాక్సిన్ వచ్చే వరకు తమ పిల్లలను స్కూళ్లకు పంపేది లేదని వారు ఆ సర్వేలో చెప్పారు. మెజారిటీ పేరెంట్స్ తమ పిల్లలను స్కూళ్లకు పంపబోమని అంటున్నారు.
ఇక 2020-21 విద్యాసంవత్సరానికి గాను స్కూళ్లు ఎలాంటి ఫీజునూ పెంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నం.46ను విడుదల చేయగా.. చాలా వరకు స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నాయని.. తల్లిదండ్రులు సర్వేలో చెప్పారు. సదరు జీవో ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాలను పాటించని స్కూళ్ల గుర్తింపును రద్దు చేసి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ 60.6 శాతం వరకు స్కూళ్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఏమాత్రం పాటించడం లేదని.. తల్లిదండ్రులు చెప్పారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు స్కూళ్లను ఓపెన్ చేస్తారా ? చేస్తే ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ? తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు ఎలాంటి భయం లేకుండా పంపుతారా ? అన్న ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ విషయంలో అటు ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.