పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులు ముందే ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభ సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుకు అనుకున్న ప్రకారం.. ఈనెల 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే.. అంతకన్నా ముందే ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఆఖరి రోజున ఆర్బిట్రేషన్ బిల్లు, ఇంధన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాయి. రాజ్యసభ ఆమోదంతో గతిశక్తి బిల్లు పార్లమెంటు గడప దాటింది. ఈనెల 10న పదవీ విరమణ చేయనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఘన వీడ్కోలు పలికారు.
వర్షాకాల సమావేశాలు అనేక కీలక ఘట్టాలకు వేదికయ్యాయి. నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఈ సమావేశాల్లోనే సభ్యులు ఎన్నుకున్నారు. ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం వంటి అంశాలపై విపక్షాల నిరసనలతో.. ఉభయసభలు హోరెత్తాయి. ధరల పెరుగుదలపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ జరిపింది ప్రభుత్వం. కొన్ని కీలక బిల్లులు ఆమోదింపచేసుకుంది.
లోక్‌సభ పనితీరుపై స్పీకర్ కార్యాలయం వెల్లడించిన వివరాలు:
- 16 రోజుల్లో 44.29గంటల పాటు జరిగిన లోక్‌సభ కార్యకాలపాలు. 48 శాతం ఉత్పాదకతతో సమావేశాలు.
- ఆరు బిల్లు కొత్త బిల్లులు సభలో ప్రవేశ పెట్టిన కేంద్రం.
- మొత్తం 7 బిల్లులకు ఆమోదం తెలిపిన లోక్‌సభ.
- 377 నిబంధన కింద 318 అంశాలపై సభ్యులు ప్రస్తావించగా… శూన్యగంటలో 98 విషయాలను సభ్యులు ప్రస్తావించారు.
- వివిధ స్థాయి సంఘాలు 41 నివేదికలు పార్లమెంటుకు అందించాయి.
- 47 అంశాలపై ప్రకటన చేసిన మంత్రులు.
- 91 ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశ పెట్టిన సభ్యులు.
- ధరల పెరుగుదల, క్రీడల ప్రోత్సాహంపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి.