స్వలింగ సంపర్కం సమాజాన్ని నాశనం చేస్తుంది.. నిరసన వ్యక్తం చేసిన పాస్టర్..!

-

స్వలింగ సంపర్కం సమ్మతమే, అది నేరం కాదు.. అని తెలియజేస్తూ సుప్రీం కోర్టు ఈ మధ్యే తీర్పునిచ్చిన విషయం విదితమే. దీంతో ఆ వర్గానికి చెందిన వారు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అనేక మంది స్వలింగ సంపర్కులు రహదారులపైకి వచ్చి ఆనందం వెలిబుచ్చారు. అయితే స్వలింగ సంపర్కం సృష్టి విరుద్ధమని, అది సమాజాన్ని నాశనం చేస్తుందని ఓ పాస్టర్ కోర్టు హాల్‌లో నిరసన తెలిపాడు. ఈ ఘటన కోయంబత్తూర్‌లోని జిల్లా కోర్టులో చోటు చేసుకుంది.

కోయంబత్తూర్‌కు చెందిన పులియకుళం చర్చి ఫాదర్ ఫీలిక్స్ జెబాసింగ్ ఇవాళ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు వెళ్లి కోర్టు హాల్‌లో స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. స్వలింగ సంపర్కం సృష్టికి విరుద్ధమన్నాడు. దాని వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని, అవి సమాజాన్ని నాశనం చేస్తాయని ఫీలిక్స్ నినదించాడు. కనుక ప్రతి ఒక్కరు స్వలింగ సంపర్కానికి మద్దతు తెలపకూడదని కోరాడు. కోర్టులు కూడా ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని అన్నాడు.

అయితే ఫీలిక్స్ చేస్తున్న నినాదాలను గమనించిన స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచి పెట్టారు. కాగా సుప్రీం కోర్టు ఇటీవలే ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377పై తీర్పునిచ్చింది. 158 ఏళ్లుగా స్వలింగ సంపర్కం నేరమని ఆ సెక్షన్‌లో ఉండగా, దానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పుచెప్పింది. ఒక వ్యక్తి చెందిన ఫీలింగ్స్ అనేవి ఆ వ్యక్తి ఇష్టమే కానీ, వాటిని ఎవరూ నియంత్రించలేరని, ఎవరు ఎవర్ని ఇష్టపడతారో ఎవరికి వారే నిర్ణయించుకుంటారని, దానిపై నియంత్రణ ఉండదని కోర్టు చెబుతూ స్వలింగ సంపర్కం సమ్మతమే అని సుప్రీం కోర్టు తీర్పుచెప్పింది. దీంతో ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, కీర్) వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version