కరోనా లాక్‌డౌన్ నేపథ్యలో ఈ-కామర్స్ సంస్థలకు రద్దీ పెరిగింది. నిత్యావసరాలను డెలివరీ చేయడంలో ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. దీన్ని గమనించిన పతంజలి సంస్థ ఇకపై ఆన్‌లైన్ బాట పట్టనుంది. అందుకుగాను ఆ సంస్థ ఆర్డర్ మి (OrderMe) అనే వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభించనుంది. అందులో వినియోగదారులు ఆర్డర్ చేసే వస్తువులను వారి ఇండ్లకే డెలివరీ చేయనున్నారు.
యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థకు చెందిన ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందిస్తుండడం, స్వదేశీ కంపెనీ కావడంతో జనాలు కొన్నేళ్లుగా పతంజలి ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీకి సొంతంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ లేదు. పలువురు సెల్లర్లు ఇతర ఈ-కామర్స్ సంస్థల వెబ్‌సైట్లలో ఆ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. కానీ.. ఇకపై పతంజలి సొంతంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకోనుంది. OrderMe సైట్‌ను మరో 15 రోజుల్లో లాంచ్ చేయనున్నారు.
OrderMe సైట్‌లో వినియోగదారులు ఆర్డర్ చేసే వస్తువులను కేవలం కొన్ని గంటల్లోనే ఇండ్లకు డెలివరీ చేస్తామని ఆ సంస్థ ఎండీ బాలకృష్ణ తెలిపారు. ఇక సరుకులను డెలివరీ చేసేందుకు ఎలాంటి చార్జిలను వసూలు చేయబోమని తెలిపారు. కాగా పతంజలి సంస్థ చాలా తక్కువ కాలంలోనే అంతర్జాతీయ సంస్థలకు గట్టిపోటీనిచ్చింది. భారతీయత, ఆయుర్వేదం అనే రెండు అంశాలే లక్ష్యంగా ఆ సంస్థ తన ఉత్పత్తులను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లింది. దీంతో హిందూస్థాన్ యూనిలివర్ లాంటి భారీ అంతర్జాతీయ సంస్థలే తమ ఉత్పత్తులకు ఆయుర్వేద రంగు జోడించి వాటిని అమ్మాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు పతంజలి ఈ-కామర్స్ బాట పట్టనుండడంతో మరిన్ని కంపెనీలకు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.