తిరుమలలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. తిరుమలలో రేపటి నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. వేడుకలకు ఈరోజు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు దోషం కలగకుండా.. ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటి రోజున పవిత్రాల ప్రతిష్ట, రెండవ రోజు పవిత్రల సమర్పణ, ఆఖరి రోజున పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
నిన్న శ్రీవారిని 5,491 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.42 లక్షలు వచ్చింది.అదే విధంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 29 నుంచి 31 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కారంపూడి లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఇందుకు బాలాలయంలో యాగశాల, పందిరితోపాటు ఇతర ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.